Home  »  Featured Articles  »  హాఫ్ సెంచరీ బాక్సాఫీస్ సింహం నందమూరి బాలకృష్ణ.. తరాలు మారినా తరగని నట విశ్వరూపం!

Updated : Jun 9, 2026

(జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా..)

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘మాస్’ అనే పదానికి నిలువెత్తు రూపం, రికార్డుల వేటలో అపర సింహం.. నందమూరి బాలకృష్ణ. జూన్ 10న ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని, ఐదు దశాబ్దాలుగా వెండితెరపై ‘నటసింహం’లా గర్జిస్తున్నారు బాలయ్య. ఇప్పటి తరం యంగ్ హీరోలకు సైతం బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇస్తూ, బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల క్లబ్ సినిమాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ సినీ ప్రస్థానం ఒక అద్భుతం. 

బాలకృష్ణ సినీ ప్రయాణం 1974లో తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన 'తాతమ్మ కల' చిత్రంతో బాలనటుడిగా ప్రారంభమైంది. ఆ తర్వాత 'దాన వీర శూర కర్ణ', 'అక్బర్ సలీం అనార్కలి' వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి నటుడిగా ఓనమాలు నేర్చుకున్నారు. ఎన్టీఆర్ నుంచి బాలయ్య కేవలం నటనా వారసత్వాన్ని మాత్రమే కాదు.. క్రమశిక్షణ, సమయపాలన, వృత్తి పట్ల అంకితభావం, నటనలో పరిపూర్ణత వంటి గొప్ప లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. షూటింగ్ స్పాట్‌కు అందరికంటే ముందే రావడం, డైలాగ్ డెలివరీలో స్పష్టత పాటించడం తండ్రి నుంచి ఆయన నేర్చుకున్న అత్యుత్తమ సూత్రాలు. కేవలం తండ్రి ఇమేజ్‌పైనే ఆధారపడకుండా, 'మంగమ్మగారి మనవడు' చిత్రంతో సోలో హీరోగా టాలీవుడ్‌లో తిరుగులేని కమర్షియల్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు.

క్యారెక్టర్ల పరంగా చూస్తే బాలకృష్ణ చేసిన ప్రయోగాలు టాలీవుడ్‌లో మరే హీరో చేయలేదనే చెప్పాలి. 'ఆదిత్య 369'తో సైన్స్ ఫిక్షన్, 'భైరవద్వీపం'తో జానపదం, 'శ్రీకృష్ణార్జున విజయం'తో పౌరాణికం, 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' చిత్రాలతో సరికొత్త ఫ్యాక్షనిజం ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రౌద్ర రసం పండించడంలోనూ, సుదీర్ఘమైన సంభాషణలను ఏకధాటిగా పలకడంలోనూ బాలయ్య తర్వాతే ఎవరైనా. 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి చారిత్రాత్మక చిత్రంలో ఆయన పలికించిన రాజసం నభూతో నభవిష్యత్.

కలెక్షన్ల పరంగా కూడా బాలయ్య సృష్టించిన రికార్డులు అసాధారణమైనవి. తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారిగా 50 రోజులు, 100 రోజులు, అలాగే సిల్వర్ జూబ్లీ (175 రోజులు) అత్యధిక కేంద్రాలలో ప్రదర్శించబడిన చిత్రాల రికార్డు బాలకృష్ణ పేరిటే ఉంది. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ.. ఇటీవలి కాలంలో ఆయన నటించిన 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' చిత్రాలు వరుసగా వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఆయనకున్న తిరుగులేని స్టామినాను మరోసారి చాటిచెప్పాయి.

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు దాటినా, నేటికీ అదే ఎనర్జీతో, అదే ఉత్సాహంతో సరికొత్త కథలను ఎంచుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు బాలకృష్ణ. వెండితెరపై మాస్ హీరోగానే కాకుండా, ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ద్వారా బుల్లితెరపై నయా ట్రెండ్ క్రియేట్ చేసి నేటి తరం యువతకు ఐకాన్‌గా మారారు. ఒకవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమందికి ఉచిత వైద్యం అందిస్తూ రియల్ హీరోగానూ నిలుస్తున్నారు. 

గతంలో 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య మళ్లీ చేతులు కలిపారు. NBK 111గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా రోల్‌లో కనిపించబోతున్నట్లు టాక్. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, హనీ రోజ్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ గ్లింప్స్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.

సోషల్ మెసేజ్‌తో కూడిన పక్కా కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో బాలయ్య ఒక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలయ్య బాబును ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌ను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్స్, యాక్షన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించనున్నాయట. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ చివరి వారంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.

ఇవి కాకుండా మ‌రికొన్ని సినిమాలు బాల‌య్య చెయ్య‌బోతున్నారంటూ ఫిలింన‌గ‌ర్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'ఎన్టీఆర్ బయోపిక్' చిత్రాల తర్వాత దర్శకుడు క్రిష్, బాలయ్య కాంబోలో మరో సినిమా లాక్ అయినట్లు తెలుస్తోంది. క్రిష్ ఇటీవల బాలయ్యకు ఒక పవర్‌ఫుల్ హిస్టారికల్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్ వినిపించగా, బాలయ్య వెంటనే ఓకే చెప్పారట. మైత్రీ మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది.

యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ సైతం బాలయ్య కోసం ఒక వైవిధ్యమైన కథను సిద్ధం చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో నడిచే పక్కా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. బాలయ్యను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేసేందుకు వివేక్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశార‌ని తెలుస్తోంది. 'నాంది', 'ఉగ్రం' చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల కూడా బాలకృష్ణకు ఒక పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీ లైన్ వినిపించారు. ఈ కాన్సెప్ట్ బాలయ్యకు నచ్చడంతో భవిష్యత్తు ప్రాజెక్టుల లిస్టులో దీనిని కూడా చేర్చారు. దీనితో పాటు 'ఆదిత్య 369' సీక్వెల్ అయిన 'ఆదిత్య 999 మాక్స్' గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ఐదు దశాబ్దాలుగా త‌న  సినీ ప్రస్థానాన్ని కొన‌సాగిస్తూ ఇప్పటికీ కుర్ర హీరోల కంటే స్పీడ్‌గా 4 నుండి 5 క్రేజీ సినిమాలను లైన్‌లో పెట్టి బాక్సాఫీస్ వద్ద నరసింహస్వామిలా దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.